చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. శుక్రవారం ఆయన చెన్నూరు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేపట్టి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అన్ని రంగాల్లో ప్రగతికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు చెప్పారు.
మొదట జైపూర్‌లో 63 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి వివేక్ వెంకటస్వామి పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
అనంతరం రూ.80 కోట్లతో చేపట్టనున్న పుష్కర ఘాట్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
కోటపల్లిలో రూ.1.60 కోట్లతో ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఎస్సీ హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కేజీబీవీ అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను కూడా ప్రారంభించారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పరిశుభ్రమైన అల్పాహారం అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు.
మందమర్రిలోనూ పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. బీఆర్ఎస్, బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనతో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు.
చెన్నూరు, మందమర్రి, జైపూర్, కోటపల్లి ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని, బలమైన కేడర్‌ను తయారు చేసి పార్టీని విజయపథంలో నడిపిస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులను ప్రజలకు చేరువ చేస్తూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ మరింత ప్రజలకు చేరువ అవుతుందని తెలిపారు.












