మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామిపై చేసిన విమర్శలను కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు పి. రఘునాథ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బాల్క సుమన్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని, ఆయన వ్యాఖ్యలు సిగ్గుచేటని అన్నారు.
స్థానిక ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, బాల్క సుమన్ గతంలో ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్‌గా పనిచేసిన కాలంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమం శూన్యంగా మారిందని, రౌడీయిజం, గుండాయిజం, భూకబ్జాలు పెరిగాయని ఆరోపించారు. చెన్నూరులో ఇసుక రీచ్‌ల ద్వారా కోట్లాది రూపాయలు దండుకున్నారని ప్రశ్నించారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం తీవ్రంగా దెబ్బతిందని, సింగరేణి సంస్థను నిర్వీర్యం చేశారని రఘునాథ్ రెడ్డి ఆరోపించారు. అధికారం కోల్పోయిన బాధతో సింగరేణి ఆస్తులను ధ్వంసం చేయాలని, రైల్వే పట్టాలు కోయాలని ప్రేరేపించడం సమంజసం కాదని, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి కుట్రలు పన్నడంతోనే పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు.
మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి, నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నారని, మందమర్రిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారని రఘునాథ్ రెడ్డి చెప్పారు. సింగరేణి నిధులు ఇతర ప్రాంతాలకు తరలిపోయినప్పుడు బాల్క సుమన్ ఏం చేశారని ప్రశ్నించారు.
ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి పెరుగుతున్న ఆదరణను చూసి బీఆర్ఎస్ నేతలు అసహనానికి గురవుతున్నారని, అందుకే విధ్వంసకర రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి అవినీతి రహిత పాలన అందిస్తున్నారని, గుండాయిజం, భూకబ్జాలు, ఇసుక దందాలకు అడ్డుకట్ట వేశారని పేర్కొన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో బాల్క సుమన్ రాజకీయ భవిష్యత్తు లేదని, మంత్రి వివేక్ వెంకటస్వామి మాత్రమే ప్రజాహితం కోసం నిరంతరం పనిచేస్తున్నారని కొనియాడారు.











