Mancherial/Jaipur (అక్షరవేకువ) జూన్ 30
సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ పరిధిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ఆయన తీవ్రంగా స్పందించారు. నిరుద్యోగ యువతను మోసం చేసే కేటుగాళ్లను వదిలిపెట్టబోమని ఆయన తెలిపారు.
సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ పరిధిలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ఉద్యోగాల పేరుతో సాగుతున్న వసూళ్ల వ్యవహారంపై ఆయన తీవ్రంగా స్పందించారు.
ఈ అక్రమాలకు పాల్పడుతున్నది ఎంతటి పెద్ద అధికారులైనా, రాజకీయ నాయకులైనా లేదా పార్టీ కార్యకర్తలైనా సరే... ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదని మంత్రి తేల్చి చెప్పారు. ఉద్యోగాల ఆశ చూపి నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారనే సమాచారం తన దృష్టికి వచ్చిందని మంత్రి తెలిపారు. దీనిపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఈ ఉదంతాన్ని అత్యంత తీవ్రమైన అంశంగా పరిగణించాలని, అవసరమైతే పోలీసుల ద్వారా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. నిరుద్యోగులను మోసం చేసే కేటుగాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం. ఉద్యోగాల కల్పన ప్రక్రియ అంతా అత్యంత పారదర్శకంగా జరిగేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది.
ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే నిరుద్యోగ యువత అసలు నమ్మవద్దని, అలాంటి వారిపై వెంటనే సంబంధిత అధికారులకు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఇటువంటి అక్రమాలకు, మోసాలకు పాల్పడే వారి పట్ల ప్రభుత్వం అత్యంత కఠిన వైఖరితో వ్యవహరిస్తుందని ఆయన హెచ్చరించారు.











