దళిత అభ్యున్నతికి, సామాజిక సమానత్వానికి పాటుపడిన మహోన్నత వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ 138వ జయంతిని నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, అధికారులు, ప్రజాప్రతినిధులు భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నిర్మల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, భాగ్యరెడ్డి వర్మ జీవితం, ఆయన చేసిన సేవలను అధికారులు స్మరించుకున్నారు. దళిత బాలికల విద్య కోసం ఆయన చేసిన కృషిని, సమాజంలో నెలకొన్న అసమానతలను రూపుమాపడానికి ఆయన చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమాలను కలెక్టర్ భవేశ్ మిశ్రా వివరించారు.
నాటి నిజాం కాలంలోనే దళిత బాలికల కోసం 26 పాఠశాలలను స్థాపించడం, కుల వివక్ష నిర్మూలన, దేవదాసీ వ్యవస్థ రద్దు, మద్యపాన నిషేధం వంటి అంశాలపై ప్రజలను చైతన్యపరచడంలో భాగ్యరెడ్డి వర్మ పాత్ర అమోఘమని కలెక్టర్ ప్రశంసించారు. ఆది హిందూ సోషల్ లీగ్ స్థాపించి, జాతుల మధ్య అంతరాలను తగ్గించడంలో ఆయన విశేష కృషి చేశారని తెలిపారు.
భాగ్యరెడ్డి వర్మ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆయన చూపిన మార్గంలో నడవాలని యువతకు కలెక్టర్ పిలుపునిచ్చారు. ఇలాంటి మహనీయుల జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం ద్వారా వారి త్యాగాలు, ఆశయాలు నేటి తరానికి చేరువవుతాయని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి దయానంద్, ఈడి ఎస్సీ కార్పొరేషన్ శంకర్, వివిధ సంక్షేమ శాఖల అధికారులు, దళిత సంఘాల నాయకులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.










