హజీపూర్, 5 August
హాజీపూర్ మండలం: పల్లె పాలనలో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం ప్రతి 45 రోజులకు ఒకసారి మండల పరిషత్ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశాల్లో గ్రామ సర్పంచులు, అధికారులు పాల్గొని ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులపై చర్చించనున్నారు.
హాజీపూర్ మండలం: పల్లె పాలనలో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గ్రామ పంచాయతీలకు సర్పంచులు ఎన్నికైనప్పటికీ, మండల స్థాయిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగకపోవడం పాలనపై కొంత ప్రభావం చూపుతోంది. మండలాల వారీగా ప్రత్యేక అధికారులు ఉన్నప్పటికీ, గ్రామాల్లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు వారికి పూర్తి అధికారాలు లేని పరిస్థితి నెలకొంది.
గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు అవకాశం కల్పించే ఉద్దేశ్యంతో, ప్రభుత్వం ప్రతి 45 రోజులకు ఒకసారి మండల పరిషత్ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశాల్లో గ్రామ సర్పంచులు వివిధ శాఖల అధికారులతో చర్చించి, సమస్యలపై తీర్మానాలు చేయడం ద్వారా వాటి పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ క్రమంలో, మండలాల్లో సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ సమావేశాల్లో ప్రధానంగా పల్లెల్లో ప్రజా సమస్యలను తెలుసుకోవడం, సంక్షేమ పథకాల అమలు తీరును సమీక్షించడం, జరుగుతున్న పనుల పర్యవేక్షణను పక్కాగా చేపట్టడం వంటి అంశాలపై చర్చిస్తారు. తద్వారా గ్రామాల్లో పారదర్శక పాలన ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
అంతేకాకుండా, గ్రామాల అభివృద్ధి పనులకు ఊతం ఇచ్చేలా చర్యలు తీసుకుంటారు. వీటితో పాటు పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి పనులు, రహదారుల నిర్వహణ వంటి కీలక రంగాలపై సమీక్షించి, పురోగతికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటారు. పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తారు.
సర్పంచులు సమావేశాల్లో లేవనెత్తే సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం దక్కుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశాల ద్వారా స్థానిక సమస్యల పరిష్కారంతో పాటు, ప్రభుత్వ పథకాల అమలులో జవాబుదారీతనం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.










