తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మందమర్రి పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనాలను మూడు జోన్ల విభాగంగా పెంచిన నేపథ్యంలో, మందమర్రి పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పట్టణ అధ్యక్షుడు మంద తిరుమల్ రెడ్డి, రాష్ట్ర నాయకులు బండి సదానందం యాదవ్, మాజీ అధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్, జిల్లా, పట్టణ నాయకులు ఈ పాలాభిషేకంలో పాల్గొన్నారు.
నాయకులు మాట్లాడుతూ, కాకా గడ్డం వెంకటస్వామి కుటుంబం ఎల్లప్పుడూ కార్మికుల సంక్షేమానికి పాటుపడిందని, ప్రస్తుత మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ కూడా అదే స్ఫూర్తితో పనిచేస్తున్నారని తెలిపారు. కార్మికుల ఆర్థిక ఇబ్బందులను గుర్తించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో వేతనాలు పెంచిన ఘనత మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికే దక్కుతుందని అన్నారు.
ఈ వేతనాల పెంపుతో రాష్ట్రంలోని ఒక కోటి పదకొండు లక్షల కార్మిక కుటుంబాలు ఆనందంగా ఉన్నాయని, వారు ముఖ్యమంత్రి, మంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని నాయకులు పేర్కొన్నారు. మందమర్రి పట్టణంలోని కార్మికులు కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ పాలాభిషేకం నిర్వహించారని తెలిపారు.
తెలంగాణ ప్రజలు, పెద్దపల్లి పార్లమెంట్, చెన్నూరు నియోజకవర్గ ప్రజలు కార్మికులు, పేద, బడుగు బలహీన వర్గాల పక్షాన నిరంతరం కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీని, స్వర్గీయ కాకా వెంకటస్వామి ఆశీస్సులతో పనిచేస్తున్న మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణలను గమనించాలని కోరారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.










