తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ (టీపీఎస్ఏ) రాష్ట్ర నాయకులు, పంచాయతీ కార్యదర్శుల సమస్యలపై కమిషనర్ దివ్యతో గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో హాజరు నమోదు సమయాన్ని ఉదయం 10 గంటలకు పొడిగించడంతో పాటు, ప్రమోషన్ల ప్రక్రియను వేగవంతం చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు.
సుమారు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా డీఎస్ఆర్ సమయపాలన, ఉదయం 9 గంటలకే హాజరు నమోదు చేయాల్సి రావడం వల్ల పంచాయతీ కార్యదర్శులు, ముఖ్యంగా మహిళా కార్యదర్శులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. కార్యదర్శుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న కమిషనర్ దివ్య, హాజరు నమోదు సమయాన్ని ఉదయం 10 గంటలలోపు కచ్చితంగా చేసుకోవాలని సూచిస్తూ, సమయ వెసులుబాటు కల్పించారు. ఇది పంచాయతీ కార్యదర్శులకు, ముఖ్యంగా మహిళా కార్యదర్శులకు కొంత ఊరటనిస్తుందని అసోసియేషన్ నాయకులు తెలిపారు. అదేవిధంగా, క్యాడర్ స్ట్రెంత్ ఫైల్‌పై చర్చించినప్పుడు, వారం రోజుల్లోగా ప్రక్రియను పూర్తి చేసి పంచాయతీ కార్యదర్శులకు ప్రమోషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న ఖాళీలను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేసేందుకు చర్యలు చేపడతామని ఆమె పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీపీఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సతీష్ కుమార్, వాణి, ప్రవీణ్‌తో పాటు జిల్లాల అధ్యక్షులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ నిర్ణయాలు పంచాయతీ కార్యదర్శుల పనితీరును మెరుగుపరుస్తాయని భావిస్తున్నారు.












