వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయాన్ని మల్టీ జోన్ ఐజీ షానవాజ్ ఖాసిం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఐజీ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి, మొక్కలు నాటారు.
ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లోని ఆర్ఐ స్టోర్, మోటార్ వెహికల్ సెక్షన్, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ (బీడీ) టీమ్ విభాగాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, వాటి నిర్వహణ, పనితీరు, సిబ్బంది విధుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసు సిబ్బంది ఆయుధాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, విధి నిర్వహణ సమయంలో బాడీ ప్రొటెక్టర్లు, లాఠీలు, హెల్మెట్లు తప్పనిసరిగా ఉపయోగించాలని ఐజీ షానవాజ్ ఖాసిం సూచించారు. ఆర్ఐ స్టోర్‌లోని ప్రతి వస్తువు వినియోగానికి సిద్ధంగా, మంచి స్థితిలో ఉండాలని, సంబంధిత అధికారులు వాటి నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆదేశించారు. మోటార్ వెహికల్ సెక్షన్‌ను తనిఖీ చేస్తూ, ప్రతి పోలీసు వాహనం మంచి కండిషన్లో ఉండేలా ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించాలని, వాహనాలు నిరుపయోగంగా ఉండకుండా చూడాలని సూచించారు. వాహనాల పరిస్థితిని క్రమం తప్పకుండా తనిఖీ చేసి, వాహనాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఇన్చార్జ్ సిబ్బందికి రివార్డులు అందించాలని అధికారులకు సూచించారు. డాగ్ స్క్వాడ్‌ను పరిశీలిస్తూ, జాగిలాల ఆరోగ్యం, ఆహారం, సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వాటికి క్రమం తప్పకుండా పరేడ్, డ్రిల్ నిర్వహిస్తూ, వివిధ కేసుల ఛేదనలో కీలకంగా వ్యవహరించాలని అన్నారు. డాగ్ హ్యాండ్లర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించకూడదని, జాగిలాల సర్వీస్ బుక్స్, ఆరోగ్య వివరాలు, రోజువారీ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు.
పోలీసు సిబ్బందికి అందించాల్సిన రెయిన్ కోట్లు, వూలెన్ జాకెట్లు తదితర అవసరమైన సామగ్రిని సకాలంలో అందేలా చూడాలని, వర్షాకాలంలో వరదలు, చెరువులు, కుంటల వద్ద జరిగే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన భద్రతా కిట్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు. అనంతరం పోలీసు సిబ్బందితో మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ విధుల పట్ల అంకిత భావంతో పని చేయాలని, తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ నిర్వహణ, రికార్డుల నిర్వహణ సంతృప్తికరంగా ఉన్నాయని ప్రశంసించారు. విధి నిర్వహణలో మంచి పనితీరు కనబరిచిన అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించి, రివార్డులు ప్రకటించారు. డీఎస్పీలతో నిర్వహించిన సమీక్షలో ఐజీ మాట్లాడుతూ, ఆస్తి సంబంధిత నేరాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని, తరచూ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలు నిర్వహిస్తూ, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిఘా పెంచి, అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేరాల నివారణకు ముందస్తు సమాచార సేకరణ, పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ తనిఖీలలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, డీటీసీ అదనపు ఎస్పీ శ్రీనివాస్ రావు, డీఎస్పీలు సత్యయ్య గౌడ్, ప్రభాకర్, వెంకట్ రెడ్డి, సైదా నాయక్, సురేందర్ రెడ్డి, ఏఆర్ డీఎస్పీ నరేందర్, ఆర్ఐలు సురేష్ నాయక్, రాజశేఖర్ రెడ్డి, డానియెల్, శ్రీనివాస రావు, ఇన్స్పెక్టర్లు రమేష్, సదా నాగరాజు తదితరులు పాల్గొన్నారు.












