Mancherial/Hajipur (అక్షరవేకువ) ఆగస్టు 01
హాజీపూర్ మండలం గుడిపేట సమీపంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి జలకళను సంతరించుకుంది. అయితే, ప్రాజెక్టు అందాలను వీక్షించేందుకు వచ్చే సందర్శకులకు నిరాశ ఎదురవుతోంది. మంచిర్యాల వైపు నుంచి ప్రాజెక్టుకు వెళ్లే దారిని పోలీసులు భారీకేడ్లతో మూసివేసి, సందర్శకులను అనుమతించడం లేదు.
హాజీపూర్ మండలం గుడిపేట సమీపంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి జలకళను సంతరించుకుంది. అయితే, ప్రాజెక్టు అందాలను వీక్షించి ఆనందించాలనుకునే సందర్శకులకు నిరాశ ఎదురవుతోంది. మంచిర్యాల వైపు నుంచి జలాశయానికి వెళ్లే దారిలో సందర్శకులు వెళ్లకుండా హాజీపూర్ పోలీసులు భారీకేడ్లను ఏర్పాటు చేసి బందోబస్తు చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోల్లో తరలివచ్చిన సందర్శకులను పోలీసులు అడ్డుకోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు.
ప్రాజెక్టు నిర్మాణం అనంతరం అవతలి వైపున ఉన్న పెద్దపల్లి జిల్లాకు చిన్న వాహనాల రాకపోకలకు అనుమతులు ఇవ్వడంతో ఈ మార్గం ద్వారా ప్రతిరోజూ వందలాదిమంది ప్రయాణిస్తున్నారు. రామగుండంలోని ఎన్టీపీసీకి విధులకు హాజరయ్యే ఉద్యోగులు, పెద్దపల్లి జిల్లాలో పనిచేసే కూలీలు, ఇతర కార్మికులు ఈ ప్రాజెక్టు మార్గంలోనే రాకపోకలు సాగిస్తుంటారు. పాల వ్యాపారులు కూడా ప్రతిరోజూ పదుల సంఖ్యలో మంచిర్యాల జిల్లా కేంద్రానికి ఈ మార్గం ద్వారానే వెళుతుంటారు.
ప్రస్తుతం ప్రాజెక్టు పైకి వెళ్లేందుకు ఆంక్షలు విధించడంతో స్థానికులు, పర్యాటకులు, పోలీసులు, నీటిపారుదల శాఖల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఉద్యోగులకు, కూలీలకు తప్పనిసరి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.











