జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించేందుకు పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రహదారి భద్రతా ప్రమాణాలను మెరుగుపరచాలని సూచించారు. ప్రమాద రహిత జిల్లా లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
ప్రమాద రహిత (జీరో ఫటాలిటీ డిస్ట్రిక్ట్ - ) కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జాతీయ రహదారి 65పై పటాన్చెరు నుంచి దిగ్వాల్ కూడలి వరకు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, అదనపు కలెక్టర్ పాండు, జాతీయ రహదారులు, రహదారులుభవనాలు, పోలీసు, రవాణా శాఖల అధికారులతో కలిసి పటాన్చెరు నుంచి జహీరాబాద్ మార్గంలో ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో రహదారి భద్రతా ప్రమాణాలను మెరుగు పరిచి, ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలను ప్రాధాన్యత క్రమంలో సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో ఎత్తైన విద్యుద్దీపాలు, హెచ్చరిక సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. పటాన్చెరు బస్టాప్ ప్రాంతంలో పాదాచారుల వంతెన ఏర్పాటు చేయాలని, కంది చౌరస్తా వద్ద రహదారి అంచులను సూచించే గుర్తులు ఏర్పాటు చేసి, రహదారి స్పష్టంగా కనిపించేలా విద్యుద్దీపాల సదుపాయం కల్పించాలని సూచించారు. పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద రాకపోకల రద్దీని తగ్గించడంతో పాటు, బస్సుల నుంచి దిగే ప్రయాణికులు సురక్షితంగా రాకపోకలు సాగించేలా తగిన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. రహదారిపై వాహనాల వేగాన్ని తగ్గించే రంబుల్ స్టిక్స్, స్పీడ్ బ్రేక్స్, వాహనాల వేగాన్ని గుర్తించే పరికరాలను ఏర్పాటు చేయడంతో పాటు, ప్రమాదకర మలుపులు, ఇరుకైన రహదారుల వద్ద ముందస్తు హెచ్చరికలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రహదారిపై వాహనాల అధిక వేగాన్ని నియంత్రించేందుకు చర్యలు సూచించారు. ప్రమాద రహిత జిల్లా లక్ష్యంగా సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. రాకపోకల నియంత్రణ, వాహనదారుల్లో రహదారి భద్రతపై అవగాహన పెంపు, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గుర్తించిన లోపాలను త్వరితగతిన పరిష్కరించి, చేపట్టిన చర్యలపై సమగ్ర నివేదికలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి లలితా దేవి, రహదారులుభవనాల శాఖ కార్యనిర్వాహక ఇంజినీరు శ్రీనివాస్, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు రవీందర్, డిటిఓ వాసు, ఏఎమ్ విఐ గౌతమ్, సంగారెడ్డి, పటాన్చెరు ఉప పోలీసు అధికారుల బృందాల అధికారులు, జాతీయ రహదారుల ఇంజినీరింగ్ అధికారులు, సంబంధిత జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ అధికారులు పాల్గొన్నారు.












