ఎల్కతుర్తి మండలం అరెపల్లి గ్రామానికి చెందిన రైతు మాటూరి విద్యాసాగర్ 20 ఏళ్లుగా పెంచిన టేకువనం అగ్నిప్రమాదంలో బూడిద కావడంతో, బాధితుడిని ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ డిమాండ్ చేశారు.
రైతు విద్యాసాగర్ తన కుటుంబ భవిష్యత్తు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా రెండు దశాబ్దాల పాటు టేకు మొక్కలను పెంచి పెద్ద వనంగా తీర్చిదిద్దారు. అయితే, ఊహించని అగ్నిప్రమాదంతో ఆయన కష్టమంతా బూడిదైపోయింది.
ఈ ప్రమాదం వల్ల రైతుకు భారీ ఆర్థిక నష్టంతో పాటు పర్యావరణానికి కూడా తీరని నష్టం వాటిల్లిందని, వందలాది టేకు చెట్లు అగ్నికి ఆహుతి కావడంతో రైతు తీవ్ర మనోవేదనకు గురయ్యారని శ్రీకాంత్ యాదవ్ తెలిపారు.
సంఘటనా స్థలాన్ని వెంటనే సందర్శించి, నష్టాన్ని అంచనా వేయాలని, రైతు మాటూరి విద్యాసాగర్‌కు ప్రత్యేక నష్టపరిహారం ప్రకటించి, తిరిగి టేకు మొక్కల పెంపకానికి అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రకృతి సంపదను కాపాడేందుకు కృషి చేస్తున్న రైతులకు భరోసా కల్పించాలని, వారి కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.












