జైపూర్ (అక్షరవేకువ) జూలై 14
ప్రేమ పేరుతో యువతిని వేధించి, ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో జైపూర్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ప్రధాన నిందితుడు గోనె వెంకటేష్‌తో పాటు అతడికి సహకరించిన తల్లి గోనె శంకరమ్మ, అక్క గోనె శైలజలను మంగళవారం అరెస్ట్ చేశారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమ పేరుతో యువతిని వేధించి, ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో జైపూర్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రధాన నిందితుడు గోనె వెంకటేష్‌తో పాటు అతడికి సహకరించిన తల్లి గోనె శంకరమ్మ, అక్క గోనె శైలజలను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.
జైపూర్ సీఐ నవీన్ కుమార్, ఎస్సై భూమేష్ వెల్లడించిన వివరాల ప్రకారం.. రెండేళ్ల క్రితం పరిచయమైన గోషిక మాధవిని ప్రేమ పేరుతో వెంకటేష్ నిరంతరం వేధిస్తూ, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించినా వెంటపడటంతో, అతడి తల్లి శంకరమ్మ, అక్క శైలజ కూడా "ఆమెను వదలొద్దు.. ప్రయత్నిస్తే చివరకు పెళ్లి జరుగుతుంది" అంటూ అతడిని ప్రోత్సహించారు.
నిందితులు ముగ్గురూ కలిసి యువతి ఇంటికి వెళ్లి పెళ్లి ప్రతిపాదన పెట్టారు. అయితే, కుల భేదాల కారణంగా కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో, పెళ్లి చేయకపోతే తన పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటానని వెంకటేష్ బెదిరించాడు. జూలై 10న గోదావరిఖనిలో మాధవిని కలిసి, పెళ్లి చేసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు.
జూలై 11న పెద్దల సమక్షంలో జరిగిన పంచాయతీలోనూ యువతి కుటుంబం తిరస్కరించడంతో, నిందితుడు తన తల్లి, అక్కలతో కలిసి "మా వాడికి ఏదైనా జరిగితే ఊరుకోం" అంటూ బెదిరింపులకు దిగాడు. ఈ మానసిక వేధింపులు తట్టుకోలేక మాధవి బలవన్మరణానికి పాల్పడింది.
పోలీసులు నిందితుడి వివో మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, సాంకేతిక ఆధారాలను సేకరించారు. నిందితుల నేర ఒప్పుకోలు, పంచనామా, లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా వారిని కోర్టులో హాజరుపరిచేందుకు చర్యలు చేపట్టారు.











