జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చక్కని చేతిరాతపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. అఖిల లిపి హ్యాండ్రైటింగ్ అకాడమీ నిర్వాహకులు, ప్రముఖ కాలిగ్రఫీ నిపుణులు మురళీధర్ విద్యార్థులకు ఉచితంగా శిక్షణ అందించారు.
ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ, విద్యార్థి దశలో మంచి మార్కులు సాధించేందుకు చక్కని చేతిరాత ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. స్పష్టమైన, అందమైన చేతిరాతతో పరీక్షల్లో సమాధానాలను ఆకర్షణీయంగా రాయడంతో పాటు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రతిరోజూ సాధన చేయడం ద్వారా తమ చేతిరాతను మెరుగు పరుచుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఉచితంగా చేతిరాత శిక్షణ అందించిన మురళీధర్‌ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.ప్రసన్నకుమార్‌తో పాటు ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అరుణ, రాజు, వెంకటరమణ, స్వర్ణలత, అనంతరామ్ గౌడ్, శారద, ఇషాక్, రామ్‌చందర్ తదితరులు పాల్గొన్నారు.












