సారంగాపూర్, 15 July
సారంగాపూర్ మండలంలో తాటి, ఈత చెట్లను నరికిన కుమ్మరి నరసయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సారంగాపూర్ మండల గౌడ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. రాజకీయ అండదండలతోనే చెట్లను నరికివేశారని, గీత కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సారంగాపూర్ మండలంలోని సారంగాపూర్ గ్రామంలో తాటి, ఈత చెట్లను నరికిన కుమ్మరి నరసయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సారంగాపూర్ మండల గౌడ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు.
మండల గౌడ సంఘం సభ్యులు ఎల్లా గౌడ్, నవీన్ గౌడ్, సాయ గౌడ్, విశ్వేశం గౌడ్, జీవన్ గౌడ్ లు మాట్లాడుతూ.. కుమ్మరి నరసయ్య తన జీతగాళ్లతో సుమారు 50 తాటి, ఈత చెట్లను నరికివేశారని తెలిపారు. రాజకీయ అండదండలు ఉన్నాయనే అహంకారంతోనే అతను ఈ చర్యలకు పాల్పడ్డాడని వారు ఆరోపించారు.
ప్రభుత్వం ఒకవైపు హరితహారం కార్యక్రమంలో భాగంగా కోట్లాది రూపాయలు వెచ్చించి, గౌడుల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ కోసం తాటి, ఈత, ఖర్జూర చెట్లను నాటుతుంటే, గ్రామాల్లోని పెత్తందారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెట్లను నరికివేస్తూ గీత కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
నరసయ్యను వెంటనే అరెస్టు చేసి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఎక్సైజ్, పోలీస్, ఫారెస్టు శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వారిని అరెస్టు చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.












