పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటుపడాలని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీజీ ఎఫ్డీసీ) డివిజనల్ మేనేజర్ గణేష్ పిలుపునిచ్చారు. 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' కార్యక్రమాల్లో భాగంగా గురువారం జైపూర్ మండలంలోని కాన్కూర్ గ్రామ శివారులో గల అటవీ ప్రాంతంలో గ్రామస్తులకు పర్యావరణ, వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులందరూ పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. మానవ మనుగడకు అడవుల ప్రాముఖ్యత ఎంతో ఉందని, అడవులలో సంచరించే వన్యప్రాణులకు ఎలాంటి హాని తలపెట్టవద్దని, అడవి జంతువులను వేటాడడం చట్టరీత్యా నేరమని డివిజనల్ మేనేజర్ గణేష్ హెచ్చరించారు.
అడవులను కాపాడుకోవడం ద్వారానే రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందుతాయని ఆయన పేర్కొన్నారు. కాన్కూర్ గ్రామంలో ప్లాస్టిక్ రహిత వాతావరణాన్ని నిర్మించడానికి, ఈ-వేస్టేజ్, తడి చెత్త, పొడి చెత్త ద్వారా జరిగే కాలుష్యాన్ని నివారించడానికి గ్రామస్తులందరూ పూర్తిగా సహకరించాలని గ్రామ సర్పంచ్ సాగరిక, కార్యదర్శి శ్రావణ్ కోరారు.
ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ పర్యావరణ రక్షణలో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ అవగాహన కార్యక్రమంలో టీజీ ఎఫ్డీసీ ప్లాంటేషన్ మేనేజర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వెంకటేశం గౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్ రేగుంట చందు, టీజీ ఎఫ్డీసీ సిబ్బంది మరియు కాన్కూర్ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












