సంగారెడ్డి, 6 October
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) పరిధిలో సంగారెడ్డి జిల్లాలో వివిధ కేంద్రాలలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 10 వైద్య పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా.కె.లలితాదేవి తెలిపారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) పరిధిలో సంగారెడ్డి జిల్లాలోని ఎస్ఎన్సీయూ, సీమోన్క్, ఎంసీహెచ్ కేంద్రాలు, డీఈఐసీ, మినీ హబ్‌లలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వైద్య పోస్టులను భర్తీ జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా.కె.లలితాదేవి తెలిపారు. ఈ మేరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 10 పోస్టులను భర్తీ చేయనుండగా, అనస్థీషియాలజిస్టులు 3, పీడియాట్రీషియన్లు 2, ఫిజీషియన్/ఎంబీబీఎస్ (ఎండీ) 1, మెడికల్ ఆఫీసర్లు 3, రేడియాలజిస్ట్ 1 పోస్టు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు నియామక తేదీ నుంచి ఏడాది పాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు.
అర్హత కలిగిన అభ్యర్థులు బయోడేటా, విద్యార్హత ధ్రువపత్రాల స్వీయ ధ్రువీకరించిన ప్రతులు, 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు బోనఫైడ్ ధ్రువపత్రం, ఇతర అవసరమైన పత్రాలతో జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. దరఖాస్తులను ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్, మొదటి అంతస్తు, రూమ్ నం.13, సంగారెడ్డిలో స్వీకరిస్తారు. అభ్యర్థులు సంబంధిత తేదీ, సమయానికి వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలని డీఎంహెచ్ఓ లలితాదేవి సూచించారు.












