అనుమతులు లేకుండా అధిక శబ్దంతో డీజే నిర్వహిస్తున్న ఇద్దరిపై దండేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. 19-09-2026 రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వాహనంలో అధిక శబ్దంతో డీజే సౌండ్ సిస్టమ్‌ను నడుపుతున్నట్లు గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం, దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారక ప్రభుత్వ పాఠశాల వద్ద పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, వాహనం 017068లో అధిక శబ్దంతో డీజే సౌండ్ సిస్టమ్‌ను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. డీజే నిర్వహణకు సంబంధించిన అనుమతి లేదా పర్మిట్ చూపించాలని పోలీసులు కోరగా, సంబంధిత వ్యక్తులు ఎలాంటి అనుమతి పత్రాలు సమర్పించలేకపోయారు. దీంతో పాత మామిడిపల్లి గ్రామానికి చెందిన అవుల వంశీ, నాసం వినయ్‌లను అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద ఉన్న డీజే ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని దండేపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు. అనుమతులు లేకుండా అధిక శబ్దంతో డీజే నిర్వహించి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని దండేపల్లి పోలీసులు తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారికి ఇబ్బంది కలిగించే విధంగా అధిక శబ్దాన్ని వినియోగించవద్దని సూచించారు.












