యువత స్వామి వివేకానందుడిని ఆదర్శంగా తీసుకొని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ పాండు అన్నారు. జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జిల్లా స్థాయి యువజనోత్సవాలను , ఉత్సాహభరితంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ పాండు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఉత్సవాల్లో సుమారు 400 మంది యువ కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వామి వివేకానందుడు యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సేవాభావం, దేశభక్తిని పెంపొందించేందుకు చేసిన బోధనలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. 1893లో అమెరికాలోని చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంటులో అమెరికా సోదరీమణులారా, సోదరులారా అంటూ స్వామి వివేకానందుడు తన ప్రసంగాన్ని ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని తెలిపారు. యువత తమలోని ప్రతిభను వెలికితీసి, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి అఖిలేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జగదీష్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత సంతోష్, యువజన సంఘాల సమితి జిల్లా అధ్యక్షుడు కూన వేణు, టీజీవో జిల్లా అధ్యక్షుడు వైద్యనాథ్, టీఎన్ జీఎస్ జిల్లా అధ్యక్షుడు జావీద్ అలీతో పాటు సంబంధిత అధికారులు, యువ కళాకారులు పాల్గొన్నారు.












