మంచిర్యాల, తెలంగాణ (అక్షరవేకువ) నవంబర్ 18
ప్రైవేట్ రవాణా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం న్యూఢిల్లీలో బీఎంఎస్, బీపీటీఎంఎం ఆధ్వర్యంలో దేశవ్యాప్త మహాధర్నా నిర్వహించనున్నారు.
దేశవ్యాప్తంగా ప్రైవేట్ రవాణా రంగంలో పనిచేస్తున్న డ్రైవర్లు, ఆటో కార్మికులు, ఇతర రవాణా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్), భారతీయ ప్రైవేట్ రవాణా కార్మికుల మహాసంఘం (బీపీటీఎంఎం) ఆధ్వర్యంలో న న్యూఢిల్లీలోని రామలీలా మైదానంలో దేశవ్యాప్త మహాధర్నా నిర్వహించనున్నారు.
రవాణా రంగ కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉపాధి భద్రత, ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే ఈ మహాధర్నా ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొంటున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఆటో, టాక్సీ, ప్రైవేట్ రవాణా రంగ కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ గళాన్ని వినిపించడానికి సిద్ధమవుతున్నారు.
కార్మికులకు ముకేశ్ గౌడ్ పిలుపు
ఈ సందర్భంగా రాష్ట్ర సంయుక్త కార్యాచరణ కమిటీ ఆటో చైర్మన్ గాజుల ముకేశ్ గౌడ్ మాట్లాడుతూ, రవాణా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న ఈ దేశవ్యాప్త ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్మికుల ఐక్యతను చాటుతూ హక్కుల సాధన కోసం ఢిల్లీ మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు.
కార్మికుల హక్కుల కోసం ఒక్కటవుదాం.. మన గళాన్ని దేశ రాజధానికి వినిపిద్దాం.. చలో ఢిల్లీ.. చలో రామలీలా మైదాన్ అని ఆయన పిలుపునిచ్చారు.






