గర్భధారణ పూర్వ, గర్భస్థ పిండ ప్రక్రియ నియంత్రణ లింగ ఎంపిక నిషేధ చట్టం 1994 ప్రకారం లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.అనిత తెలిపారు. ఈ మేరకు బుధవారం జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశంలో ఆమె పలు సూచనలు చేశారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.అనిత అధ్యక్షతన నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలో పనిచేస్తున్న స్కానింగ్ కేంద్రాలు, స్త్రీ వైద్య నిపుణుల వద్ద ఉన్న స్కానింగ్ మిషన్ల ద్వారా అందిస్తున్న వైద్య సేవలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా డా.అనిత మాట్లాడుతూ, లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, అడగడం రెండూ చట్టరీత్యా నేరమని పునరుద్ఘాటించారు. 'భేటీ బచావో బేటీ పడావో' కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, ఇందులో భాగంగా గర్భిణీల పర్యవేక్షణ, అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్ల పర్యవేక్షణ, తనిఖీలు, రికార్డుల పరిశీలన, సి సెక్షన్ ఆడిట్, తల్లులకు మహిళా సంఘాల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
ప్రతి స్కానింగ్ సెంటర్ లో లింగ నిర్ధారణ పిసిపి యాంటీ యాక్ట్ పుస్తకం, స్కానింగ్ మిషన్ల వివరాలు ప్రదర్శించాలని, ఎలాంటి ఫోటోలు ఉండరాదని, స్కానింగ్ కు వచ్చే గర్భిణులకు సౌకర్యాలు కల్పించాలని, లింగ నిర్ధారణపై అవగాహన కార్యక్రమాల గోడ పత్రాలను అతికించాలని, ఆసుపత్రి సర్టిఫికెట్లు, సేవల సంబంధిత రుసుముల వివరాలను గోడపై ప్రదర్శించాలని ఆదేశించారు.
నూతన స్కానింగ్ మెషిన్ కొనుగోలు చేయడానికి ముందుగానే 'నో అబ్జెక్షన్ సర్టిఫికెట్' తీసుకోవాలని, పాత మిషన్ ను తొలగించాలన్నా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుండి అనుమతి తీసుకోవాలని, మూసివేసిన స్కానింగ్ సెంటర్ లోని పరికరాలు, యంత్రాలను విక్రయించినట్లయితే కొనుగోలు చేసిన వారి సమాచారాన్ని అందించాలని తెలిపారు. జిల్లాలో పిండ హత్యల నివారణకు కమిటీ సభ్యులందరూ సహకరించాలని, లోపాలున్న స్కానింగ్ కేంద్రాలకు మెమోలు జారీ చేస్తామని హెచ్చరించారు.












