సంగారెడ్డి, 2026-08-22
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన ఫోటో ప్రదర్శన అనంతరం జరిగిన సమావేశంలో ఫోటో జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారికి అండగా నిలవాలని టీయుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏకే పైసల్ కోరారు.
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన ఫోటోల ప్రదర్శన అనంతరం జరిగిన సమావేశంలో టీయుడబ్ల్యూజే ఐజేయు సంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడు బండారు యాదగిరి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏకే పైసల్ మాట్లాడుతూ ఫోటో జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారికి అండగా నిలవాలని కోరారు.
స్పాట్ ఫోటోల కోసం, ప్రజా సమస్యలను మరింత త్వరగా వెలుగులోకి తెచ్చేందుకు ఫోటో జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారని బండారు యాదగిరి అన్నారు. వర్కింగ్ జర్నలిస్టులతో కలిసి పనిచేయడం వల్లనే అనేక ప్రజా సమస్యలు వెలుగులోకి వస్తున్నాయని, ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి ఉధృతంగా వెళుతున్నాయని చెప్పారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించి, ఫోటో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ముఖ్యంగా అర్హులైన ఫోటో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని, ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినా, అనారోగ్యం బారిన పడినా వైద్యం చేయించుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నందున హెల్త్ కార్డును కూడా అందజేయాలని యాదగిరి విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి సానుకూలంగా స్పందించారని, ప్రభుత్వానికి నివేదిస్తామని, అర్హులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ ఏదైనా సమస్య ఉన్నప్పుడు తనను కలిస్తే, చేతనైనంత మేరకు అండగా ఉంటామని, ఎలాంటి అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు యాదగిరిని, యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏకే పైసల్ ను ఫోటో జర్నలిస్టు సంఘం నాయకులు సన్మానించి మెమెంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, అదనపు కలెక్టర్ పాండు, డీపీఆర్ఓ విజయలక్ష్మి, జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు వైద్యనాథ్, బిజెపి సీనియర్ నాయకుడు కొండాపురం జగన్, యువజన సంఘాల నాయకుడు కూన వేణు, ఫోటో జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు ఆరిఫ్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ఇతర ముఖ్యులు సంతోష్, పవన్, రాజు, కృష్ణ, మురళి తదితరులతో పాటు పలువురు జర్నలిస్టు సంఘం నాయకులు, మీడియా ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.











