సంగారెడ్డి, 12 September
తల్లిదండ్రులను కోల్పోయి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇంజినీరింగ్ విద్యార్థినికి రోటరీ క్లబ్ ఆఫ్ మంజీరా సంగారెడ్డి అండగా నిలిచింది. విద్యార్థిని రోగటి దేవిక కళాశాల ఫీజు కోసం రూ.10 వేలు విరాళంగా అందించింది.
సంగారెడ్డి, సెప్టెంబర్ 12: తల్లిదండ్రులను చిన్ననాడే కోల్పోయి, అనేక ఇబ్బందులను అధిగమిస్తూ ఇంజినీరింగ్ విద్యను కొనసాగిస్తున్న పేద విద్యార్థినికి రోటరీ క్లబ్ ఆఫ్ మంజీరా సంగారెడ్డి అండగా నిలిచింది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ గ్రామానికి చెందిన రోగటి దేవిక చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. సంగారెడ్డి బాలసదన్‌లో ఉంటూ పదో తరగతి, పాలిటెక్నిక్ విద్యను పూర్తి చేసిన ఆమె ప్రస్తుతం అరోరా ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతోంది. కళాశాల ఫీజు చెల్లించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని మండల విద్యాధికారి డి.అంజయ్య గుర్తించారు. ఈ విషయాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ మంజీరా అధ్యక్షుడు, కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లగా, విద్యార్థినికి అండగా నిలవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన కళాశాల ఫీజు రూ.10 వేల రూపాయలను రోటరీ క్లబ్ ఆఫ్ మంజీరా సంగారెడ్డి తరఫున చెల్లించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ చైర్మన్ సి.హెచ్.అంజయ్య, కార్యదర్శి కమలాకర్ రాజు, మండల విద్యాధికారి డి.అంజయ్యతో పాటు రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.












