ఎల్నినో ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షపాతం తగ్గి, భూగర్భ జలాలు అడుగంటే అవకాశం ఉన్న నేపథ్యంలో, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ సూచనలు చేశారు.
జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీల కమిషనర్లు, డిప్యూటీ ఇంజనీర్లతో తాగునీటి సరఫరాపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పట్టణ ప్రజలకు తాగునీరు అందించడమే అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని, అందుబాటులో ఉన్న నీటి వనరులను ప్రణాళికాబద్ధంగా వినియోగించి, తాగునీటి అవసరాలు తీర్చేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రతి మున్సిపాలిటీలో తాగునీటి అవసరాలు, అందుబాటులో ఉన్న నీటి వనరులు, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా అందించవలసిన వార్డులు, భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడే అవకాశమున్న ప్రాంతాల వివరాలను సేకరించి, కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. మున్సిపాలిటీల పరిధిలో పనిచేయని బోర్ల వివరాలు సేకరించి వెంటనే మరమ్మతులు , అదనంగా అవసరమైన బోర్లను గుర్తించి సమగ్ర నివేదికలు సమర్పించాలని సూచించారు. నీటి సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ , అవసరమైన చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో నీటి వనరులను పొదుపుగా వినియోగించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. రానున్న వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. నీటి వనరులను సంరక్షిస్తూ, అందుబాటులో ఉన్న తాగునీటిని ప్రతి ఒక్కరూ పొదుపుగా వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ పాండు, డీడబ్ల్యూఈఈ ఎస్.కె.పాషా, మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ ఇంజనీర్లు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












