తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ఫీజును భారీగా పెంచడాన్ని బీసీ సమాజ్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ, తక్షణమే ఫీజును తగ్గించాలని డిమాండ్ చేసింది. పెరిగిన ఫీజు నిరుద్యోగ యువతపై అదనపు భారం మోపుతుందని ఆరోపించింది.
బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరెడ్ల శ్రీనివాస్ విడుదల చేసిన ప్రకటనలో, ఉద్యోగ దరఖాస్తు ఫీజును రూ.200 నుంచి రూ.1000కు పెంచడం నిరుద్యోగులకు తీరని లోటని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.
వేలాది మంది నిరుద్యోగులు ఆర్థిక ఇబ్బందుల మధ్య పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారని, ఈ పరిస్థితుల్లో ఫీజుల పెంపు వారిని మరింత కష్టాల్లోకి నెడుతుందని శ్రీనివాస్ తెలిపారు. ఒకే అభ్యర్థి పలు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి వస్తే, ప్రతిసారీ రూ.1000 చెల్లించడం అసాధ్యమని అన్నారు.
నిరుద్యోగుల ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, ప్రభుత్వం వెంటనే పెంచిన ఫీజును తగ్గించి, వారికి అనుకూలమైన విధానాలను అమలు చేయాలని బీసీ సమాజ్ కోరింది.











