మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని ముల్కల గ్రామంలో ఆధ్యాత్మికత పేరుతో ఒక వింత నాటకానికి తెరలేపినట్లు సమాచారం. స్వయంభూ పేరుతో దుర్గామాత ప్రతిష్టాపన చేశారనే ప్రచారం కొద్దిరోజుల్లోనే బూటకమని తేలిపోయింది. అమ్మవారిని మరో చోటుకు తరలించడమే అసలు ఉద్దేశ్యమని తెలుస్తోంది.
ఆగమశాస్త్ర, ఆధ్యాత్మిక భావాలను పట్టించుకోకుండా, తమకు అనుకూలంగా మలుచుకుంటూ దేవుడి పేరుతో విచిత్ర పోకడలు చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. దేవుడి పేరుతో సొమ్ము చేసుకోవడానికి ఈ వింత నాటకం తెరలేపారని ఆరోపణలు వస్తున్నాయి. కోటికి పైగా దాతల విరాళాల సేకరణ జరిగినప్పటికీ, దీనికి సంబంధించి ఎలాంటి ట్రస్ట్ ఏర్పాటు చేయలేదని, లెక్కల్లో తీవ్ర గందరగోళం నెలకొందని సమాచారం. ఈ విషయమై స్పష్టత కొరవడింది.
ఆలయ పూజారి పెత్తనం, అడ్డగోలు వ్యవహారాలు కొనసాగుతున్నాయని, దీనిని ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడే వైఖరి అవలంబిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు ప్రేక్షక పాత్ర వహించడం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారం సోషల్ మీడియాలో దావానలంలా వ్యాప్తి చెందుతోంది. భక్తులు, స్థానికులు ఈ పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా, ఈ వైపరీత్య పోకడలు ఏ వైపుకు దారితీస్తాయో వేచి చూడాల్సి ఉంది.












