భుజం నుంచి మెడ, ఛాతీలోని మీడియాస్టినమ్ వరకు వ్యాపించిన భారీ క్లావిక్యులర్ కణితిని కామినేని హాస్పిటల్స్ కింగ్‌కోఠి వైద్యులు విజయవంతంగా తొలగించారు. సుమారు ఎనిమిది గంటల పాటు జరిగిన ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సలో పలు విభాగాల వైద్యులు పాల్గొన్నారు.
కొత్తగూడెంకు చెందిన 62 ఏళ్ల నాగయ్య శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముఖం వాపుతో న ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షల్లో కాలర్‌బోన్ (క్లావికిల్) లోపలి చివరి భాగం నుంచి ఏర్పడిన భారీ కణితి మెడతో పాటు ఛాతీలోని మీడియాస్టినమ్ వరకు విస్తరించినట్లు గుర్తించారు. కణితి శ్వాసనాళంతో పాటు ప్రధాన రక్తనాళాలపై తీవ్ర ఒత్తిడి కలిగిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
అయోర్టిక్ ఆర్చ్, బ్రాకియోసెఫాలిక్ ఆర్టరీ, సబ్క్లావియన్, కామన్ కరోటిడ్ ఆర్టరీలపై కూడా కణితి ప్రభావం చూపుతున్నట్లు గుర్తించారు. అదేవిధంగా థైమస్ గ్రంథి పెరుగుదలను కూడా వైద్యులు గుర్తించారు.
కణితి పరిమాణం, వ్యాప్తి, కీలక అవయవాలపై ఉన్న ఒత్తిడిని పరిగణనలోకి తీసుకున్న వైద్య బృందం మల్టీడిసిప్లినరీ చర్చ అనంతరం శస్త్రచికిత్సకు నిర్ణయించింది. న సర్జన్ డాక్టర్ ముసునూరు రవికిరణ్, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శివకుమార్‌రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సందీప్ శ్రీరామ్ ఆధ్వర్యంలో శస్త్రచికిత్స నిర్వహించారు.
శ్వాసనాళంపై తీవ్ర ఒత్తిడి ఉండటంతో అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ చైతన్య, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రాకేశ్ బ్రాంకోస్కోపీ సహాయంతో ఇంట్యూబేషన్ చేసి శ్వాసమార్గాన్ని సురక్షితంగా ఉంచారు.
ప్రస్తుతం నాగయ్య పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారని, సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు. ఈ అరుదైన, క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన వైద్య బృందాన్ని పలువురు అభినందిస్తున్నారు.












