జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ అస్తవ్యస్తంగా ఉందని, ప్రజల ఆరోగ్యంపై ఎమ్మెల్యేకు శ్రద్ధ లేదని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్ రావు ఆరోపించారు. మంగళవారం ఆసుపత్రిని పరిశీలించిన గులాబీ పార్టీ నేతలు, అక్కడి దుస్థితిని మీడియాకు వివరించారు.
రోగులకు వసతులు లేని ఆసుపత్రి, మురుగు కంపు మధ్యనే నిర్వహణ సాగుతోందని, ప్రజాప్రతినిధులకు పట్టింపు లేకపోవడంతో రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని విజిత్ రావు అన్నారు. స్లాబు పెచ్చులు, గోడ పగుళ్లు రోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని తెలిపారు. కాలేజీ రోడ్డులో 450 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తయిందని, వెంటనే ప్రారంభిస్తే రోగులకు సౌకర్యవంతంగా చికిత్సలు అందుతాయని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా ఉందని, పాలన గాలికి, నిధులు జేబులోకి వెళ్తున్నాయని విమర్శించారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఇప్పటికైనా అక్రమ అవినీతి, రాబడి, సంపాదన మాని వెంటనే ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని, ప్రభుత్వాసుపత్రి ప్రారంభ చర్యలు చేపట్టాలని విజిత్ రావు డిమాండ్ చేశారు.











