పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పట్టణంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 30 మందికి పైగా పోలీసులు, ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. యువత రక్తదానానికి ముందుకు రావాలని డీసీపీ భాస్కర్ పిలుపునిచ్చారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా చివరి రోజున, పట్టణంలోని ఎం కన్వెన్షన్ హాల్లో పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా జిల్లా డీసీపీ భాస్కర్ (ఐపీఎస్), ప్రత్యేక ఆహ్వానితులుగా ఏసీపీ ప్రకాష్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రమోదరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమర పోలీసులకు శ్రద్ధాంజలిగా జిల్లాలో వివిధ ప్రాంతాలలో రక్తదాన శిబిరాలతో పాటు ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్ని దానాల కన్నా రక్తదానం ముఖ్యమని, ఎదుటి మనిషి ప్రాణాలు కాపాడే ఔషధమని, కావున రక్తదానానికి యువత తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.
ఈ శిబిరంలో పోలీసు సిబ్బందితో పాటు 30 మంది ఇతరులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. తదుపరి, రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాతలకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ కె. భాస్కర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు, రక్త నిధి ఇంచార్జ్ వి. మధుసూదన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి చందూరి మహేందర్, లైన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ పి. వెంకటేశ్వర్లు, కోశాధికారి ఏ. వెంకటేశ్వరరావు, లయన్ డాక్టర్ కే. సుగుణాకర్ రెడ్డి, రక్త నిధి సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.










