మంచిర్యాల జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు, వడదెబ్బ ముప్పు నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టారు.
జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా, వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి ఆరోగ్య సమస్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో, మంచిర్యాల మార్కెట్ ప్రాంతంలో కూరగాయల వ్యాపారులకు, ట్రాఫిక్ సిబ్బందికి వడదెబ్బ నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
అధికారులు ప్రజలకు పలు సూచనలు చేశారు. ఉదయం 11 గంటల తర్వాత అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని, వస్తే తలకు టోపీ లేదా తెల్లటి వస్త్రం ధరించాలని సూచించారు. శరీరానికి తగినంత నీరు, ద్రవపదార్థాలు అందేలా చూసుకోవాలని, రోజుకు కనీసం 15 గ్లాసుల నీరు తాగాలని, లేతరంగు, తేలికపాటి కాటన్ దుస్తులు ధరించాలని తెలిపారు.
మార్కెట్లలోని వ్యాపారులు, ఇతర వర్గాల వారు కూడా ఓఆర్ఎస్, మంచినీటిని అందుబాటులో ఉంచుకోవాలని, ట్రాఫిక్ పోలీసులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, ఏపీడీ మాలిస్ట్ సుమన్, ట్రాఫిక్ సిబ్బంది రాజమౌళి, స్థానిక వ్యాపారులు, ప్రజలు పాల్గొన్నారు.












