దండేపల్లి, 2026-08-31
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో దంపతుల మధ్య తలెత్తిన కలహాలు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. క్షణికావేశంలో ఓ తల్లి తన ఆరేళ్ల కూతురిని నడుముకు కట్టుకుని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
దంపతుల మధ్య తలెత్తిన కలహాలు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. క్షణికావేశంలో ఓ తల్లి తన ఆరేళ్ల కూతురిని నడుముకు కట్టుకుని ఆదివారం వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
లింగాపూర్ గ్రామానికి చెందిన మెరుగు రజిత (28) అనే వివాహిత తన కూతురు అక్షిత (6)ను నడుముకు కట్టుకుని ఆదివారం సాయంత్రం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకింది. రజితను జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఎనుగుమట్ల గ్రామానికి చెందిన మెరుగు అంజన్నతో ఏడేళ్ల కిందట వివాహం చేశారు. వీరికి అక్షిత (6) అనే కుమార్తెతో పాటు 18 నెలల బాబు ఉన్నారు.
దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో నాలుగేళ్ల నుంచి రజిత లింగాపూర్లోని తన తల్లిదండ్రుల వద్ద పిల్లలతో ఉంటోంది. ఆటో నడుపుకుంటూ జీవిస్తున్న భర్త అంజన్న అప్పుడప్పుడు భార్య దగ్గరికి వచ్చిపోతుంటాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం అంజన్న లింగాపూర్ వచ్చి భార్యతో గొడవ పడ్డాడు.
దీంతో మనస్తాపం చెందిన రజిత తన కూతురిని తీసుకుని వ్యవసాయ బావి వద్దకు వెళ్లి అందులో దూకింది. వ్యవసాయ పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చిన రజిత తల్లి ఇంట్లో ఉన్న అల్లుడు అంజన్నను తన కూతురు ఎక్కడ అని ప్రశ్నించగా, సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి పారిపోయాడు. అప్పటికే వ్యవసాయ బావిలో మృతదేహాలు తేలుతున్నట్లు స్థానికుల ద్వారా తెలుసుకున్న రజిత తల్లి అక్కడకు వెళ్లి గమనించింది. అవి రజిత, అక్షితల మృతదేహాలుగా గుర్తించి షాక్కు గురైంది.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎస్సై గుండేటి రాజవర్ధన్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెల్లడించారు.












