మంచిర్యాల పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో కోతులు, కుక్కల సంచారం పెరిగి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని బీజేపీ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్, కార్పొరేటర్లు కస్తూరి నాగరాజు, బోట్ల అనిత ఆరోపించారు. ప్రజల భద్రతకు సంబంధించిన ఈ జిల్లా యంత్రాంగం, మున్సిపల్ పాలకవర్గం తగిన స్థాయిలో స్పందించడం లేదని వారు విమర్శించారు.
ఈ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వారు లేఖ రాశారు. మంచిర్యాల జిల్లాలో కోతులు, కుక్కల దాడులకు సంబంధించి ఎన్ని ఘటనలు నమోదయ్యాయి, వాటి కారణంగా ఎంతమంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు అనే వివరాలను అధికారులు వెల్లడించాలని వారు కోరారు.
అలాగే జిల్లాలో డెంగ్యూ, ఇతర జ్వరాల కేసులు పెరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. దోమల నివారణకు అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ, పట్టణాలు, గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలను ముమ్మరం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఇప్పటివరకు ఎన్ని డెంగ్యూ కేసులు నమోదయ్యాయో అధికారిక వివరాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు.
కోతులు, కుక్కల నియంత్రణతో పాటు దోమల నివారణ, పారిశుద్ధ్య నిర్వహణపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని బీజేపీ నాయకులు కోరారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై తక్షణమే స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
అధికారులు వెంటనే స్పందించకపోతే ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజలతో కలిసి పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని బీజేపీ నేతలు హెచ్చరించారు.












