జైపూర్ మండలం ఇందారం గ్రామంలో రెనే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది. గ్రామీణ ప్రజలకు గుండె జబ్బులపై అవగాహన కల్పించడం, ఉచిత వైద్య సేవలు అందించడం ఈ శిబిరం ముఖ్య ఉద్దేశ్యం.
ఇందారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మహమ్మద్ ఫయాజుద్దీన్, ఉపసర్పంచ్ ఎలకటూరి శివ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కరీంనగర్ రెనే హాస్పిటల్, గోదావరిఖని సింగరేణి రెనే కార్డియాక్ సెంటర్ వైద్య బృందం పాల్గొంది.
సుమారు 410 మందికి ఉచితంగా ఈసీజీ, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ప్రముఖ కార్డియాలజిస్టులు డాక్టర్ తులసి రామ్, డాక్టర్ ధర్మతేజ, క్రిటికల్ కేర్ వైద్యులు డాక్టర్ సంతానం, డాక్టర్ క్రాంతి కుమార్, డాక్టర్ తేజస్విని రోగులను పరీక్షించి సలహాలు అందించారు.
గోదావరిఖని సింగరేణి రెనే కార్డియాక్ సెంటర్ హెడ్ రామకృష్ణ మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లాలో పూర్తిస్థాయి కార్డియాలజిస్ట్ అందుబాటులో ఉన్న ఏకైక కేంద్రం తమదేనని, అత్యాధునిక పరికరాలతో వైద్యం అందిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలోనూ ఇలాంటి ఉచిత శిబిరాలను నిర్వహిస్తామని వెల్లడించారు.












